ఢిల్లీలో చీపురుదే హవా.. కమలం, హస్తం ఖేల్‌ ఖతం

-

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఫిబ్రవరి 11న ఓట్ట లెక్కింపు జరుగనుంది. ఈ నేపథ్యంలో వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలను వెల్లడించాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలూ అధికార ఆమ్‌ఆద్మీ పార్టీయే మరోసారి జయభేరి మోగిస్తుందని స్పష్టంచేశాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చితే బీజేపీ కొన్ని స్థానాలను మెరుగుపర్చుకున్నప్పటికీ.. ఆ పార్టీ రెండో స్థానానికే పరిమితమవుతుందని సర్వేలు వెల్లడించాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం దేశ రాజధానిలో మరోసారి రిక్తహస్తమే ఎదురుకానుందని పేర్కొన్నాయి.

‘ది టైమ్స్‌ నౌ-ఐపీఎస్‌ఓఎస్‌’ ఎగ్జిట్‌పోల్‌ అంచనాల ప్రకారం ఆమ్‌ఆద్మీ పార్టీ-47, బీజేపీ 23 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. ‘ఏబీపీ-సీఓటర్‌’ సర్వే ప్రకారం ఆప్‌కు 49-63 స్థానాలు, బీజేపీకి 5-19 స్థానాలు, కాంగ్రెస్‌ 0-4 స్థానాలు దక్కనున్నాయి. ఇక ‘టీవీ9 భరత్‌వర్ష్‌-సిసిరో’ అంచనాల ప్రకారం.. ఆప్‌ 54, బీజేపీ 15, కాంగ్రెస్‌ ఒక స్థానంలో గెలుపొందనున్నాయి. ‘ద రిపబ్లిక్‌ టీవీ-జన్‌ కీ బాత్‌’ ఎగ్జిట్‌పోల్‌ అంచనాలు మాత్రం ఆప్‌ 48-61, బీజేపీ 9-21, కాంగ్రెస్‌ 0-1 స్థానాల్లో విజయం సాధిస్తుందని స్పష్టంచేశాయి. యాక్సిస్‌ సర్వే ప్రకారం ఆప్‌కు 64, బీజేపీకి 6 స్థానాలు దక్కనున్నాయి.

ఢిల్లీ అసెంబ్లీకి 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకుగాను 67 స్థానాలను ఆప్‌ తన ఖాతాలో వేసుకుంది. బీజేపీకి కేవలం మూడు స్థానాలు దక్కగా, కాంగ్రెస్‌ ఒక్కచోట కూడా గెలువలేక చతికిలపడింది. ఇక ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఆమ్‌ఆద్మీ పార్టీయే జయకేతనం ఎగురవేస్తుందని ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు స్పష్టం చేయడంతో.. ఆప్‌ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version