దేశంలో అనేక రకాల మార్కెట్లు ఉన్నాయి. కేవలం పండ్లు దొరికేవి, కొన్ని పూలు అమ్మేవి. మరికొన్ని విదేవీ స్మగుల్ వస్తువులు అమ్మేవి, కొన్ని కూరగాయలు అమ్మెవి ఇలా రకరకాల మార్కెట్లు. కానీ అన్నింట్లో మగవారు, ఆడవారు వ్యాపారులుగా ఉంటారు. కానీ దేశంలో ఒక మార్కెట్ మాత్రం పూర్తిగా మహిళలచేత నిర్వహించబడుతుంది. అటువంటి మార్కెట్ గురించి తెలుసుకుందాం…
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మహిళలచే మార్కెట్ నిర్వహించబడుతుంది. ఆ మార్కెట్ పేరు ఇమా కెయితల్. ఇక్కడ దొరకని వస్తువు ఉండదు. దుస్తులూ మసాలాదినుసులూ పండ్లూ కూరగాయలూ మణిపురికే ప్రత్యేకమైన హస్తకళాకృతులన్నీ అక్కడ ఉంటాయి. మార్కెట్టులో దుకాణదారులంతా మహిళలే. పైగా చాలావరకూ దుకాణాలు ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వ ఆస్తిలా సంక్రమిస్తుంటాయి. ప్రపంచంలో కేవలం స్త్రీలు నడిపే మార్కెట్ ఇదొక్కటే. 500 ఏళ్ల నుంచీ నడుస్తోన్న ఈ మార్కెట్టులో దాదాపు ఐదు వేలమంది మహిళలు వ్యాపారం చేస్తుంటారు. అప్పట్లో స్థానిక మెయీటెయీ తెగ ప్రజలను యుద్ధం కోసం దూర ప్రాంతాలకు పంపించేవారట. దాంతో మహిళలు గ్రామాల్లోనే ఉండి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించాల్సి వచ్చేది.
అందులో భాగంగా వాళ్లు పండించినవీ తయారుచేసినవీ వాళ్లే మార్కెట్టుకి తరలించి అమ్మేవారట. ఆ విధంగా ఈ మార్కెట్టు పుట్టి ఉండొచ్చు అని చెబుతారు. ఆ తరవాత బ్రిటిషర్ల పాలనలో అక్కడ పండించిన బియ్యాన్ని బ్రిటిష్ సైన్యానికి తరలించేందుకు ప్రయత్నించారట. అప్పుడు కూడా స్థానిక మహిళలు భారీ ఉద్యమాన్నే చేపట్టి బ్రిటిషర్లను ఎదిరించి నిలిచారు. దీనికే నుపి లాన్(మహిళల యుద్ధం) అని పేరు. ఈ విషయాన్ని సూచించే విగ్రహాలు ఆ మార్కెట్టు దగ్గర మనకి కనిపిస్తాయి. వార్తాపత్రికలు లేని సమయంలో వార్తలు తెలుసుకోవడానికి స్థానికులు ఈ మార్కెట్టుకే వచ్చేవారట. అందుకే దీన్ని వాళ్లు తమ సంస్కృతికి చిహ్నంగా భావిస్తారు. దీన్ని క్వీన్ ఆఫ్ మార్కెట్స్‌గానూ పిలుచుకుంటారు.
– కేశవ