మన హైదరాబాద్ నగరం లో క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. రెండేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో మళ్ళి ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగబోతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్ వేదికగా ఏడు మ్యాచుల్లో ఆడబోతుంది. మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనున్నది ఎసార్హెచ్. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, క్రికెట్ అభిమానుల కోసం ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఆదివారం జరిగే మ్యాచ్ సందర్భంగా మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించినాట్లు తెలిపింది ప్రభుత్వం. రద్దీ కారణంగా నాగోల్-అమీర్‌పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎక్కువ సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు. మరో వైపు ఉప్పల్ మ్యాచ్‌కు ఏర్పాట్లన్నీ ముగిసాయి. ఇంకో వైపు ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు 1500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. స్టేడియం లోపల, వెలుపల 340 సీసీకెమెరాలను ఏర్పాటు చేశామని, అలాగే జాయింట్ కమాండ్, కంట్రోల్ రూంను సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు. డే మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల కంటే ముందు స్టేడియాన్ని తెరుస్తామని, నైట్ మ్యాచ్‌లు జరిగిన సమయంఏల సాయంత్రం 4:30 గంటలకు స్టేడియాన్ని అభిమానుల కోసం తెరువనున్నట్లు సమాచారం.