కొడుకు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు.. కానీ తండ్రిది పంక్చర్ షాపు..!

-

కుమారులు ఎంత ప్రయోజకులైనప్పటికీ తాను మాత్రం టైర్లు పంక్చర్‌ చేసే వృత్తిని కొనసాగిస్తున్నాడు ఓ తండ్రి. ఇటీవ‌ల ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అమోఘ విజయాన్ని సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. దేశంలో ‘ఆప్’ ఒక సంచలనమైతే, ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు సామాన్యులుగా జీవిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఢిల్లీలోని జంగ్‌పురా నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీచేసి విజేతగా నిలిచిన ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. అయితే అతని తండ్రి పీఎన్ దేశ్‌ముఖ్ ఈరోజుకీ భోపాల్‌లో టైర్ రిపెయిరింగ్ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా దేశ్‌ముఖ్ మీడియాతో మాట్లాడుతూ కుమారుడు తనను ఢిల్లీ వచ్చి తమతోపాటు ఉండమని చెబుతుంటాడని అన్నారు. అయితే తనకు అక్కడకు వెళ్లడం ఇష్టం లేదని తెలిపారు. భోపాల్‌లోని ఇదే టైర్ రిపెయిరింగ్ దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతో పిల్లలను చదివించానని. ఫలితంగానే వారు ఈ స్థాయికి చేరారని అన్నారు. అందుకే ఈ దుకాణాన్ని మూసివేయాలనుకోవడంలేదని స్పష్టం చేశారు. తనకు ఇద్దరు కుమారులని వారిలో ప్రవీణ్ చిన్నవాడని తెలిపారు. పెద్ద కుమారుడు హైదరాబాద్‌లోని ఒక కంపెనీలో పనిచేస్తున్నాడన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version