ఫాదర్స్ డే స్పెషల్: పుట్టకపోవడం శాపం కాదు.. సక్రమంగా పెంచకపోవడం నేరం!

-

పిల్లలు పుట్టకపోవడం శాపం అనేవారు పూర్వం! పుట్టిన పిల్లల్ని సక్రమంగా పెంచకపోవడం నేరం అందాము ఈ రోజుల్లో!! నువ్వు దేశానికి ఏమి చెయ్యకపోయినా పర్లేదు, దేశానికి ఏమివ్వకపోయినా పర్లేదు.. చెడ్డ వారసులను, దేశభక్తి లేని పౌరులను, బాధ్యతలేని భావితరాలను మాత్రం అందించవద్దు! ఇది ఇప్పటికే తండ్రులు అయినవారు, తొందర్లో తండ్రులు కాబోతున్నవారు, భవిష్యత్తులో తండ్రులు అయ్యేవారు.. అందరూ గుర్తించాల్సిన విషయం! క్రమశిక్షణతో పెంచాలి.. బాధ్యతగల పౌరులుగా పెంచాలి.. దేశంపట్ల ఎంతోకొంత కృతజ్ఞత కలిగినవారిగా మలచాలి!

ముఖ్యంగా ఆడపిల్ల తండ్రికి మూడు బాధ్యతలే కీలకం. అవే… సేవకుడు.. స్నేహితుడు.. సంరక్షకుడు! పాప పుట్టినప్పటినుంచి గారాలపట్టిని గుండేలమీద నడిపించుకుంటాడు.. ఎన్నో సేవలు చేస్తాడు.. పరిపూర్ణమైన సేవకుడిగా ఉంటాడు! కాస్త ఎదిగిన తర్వాత… ఆ తండ్రే ఆమెకు జీవితంలో మొదటి స్నేహితుడు! ఆ స్నేహం ఎంతబాగా మలుచుకోగలిగే.. ఆడపిల్లకు బయటి స్నేహాలతో అంతగా పనిలేకుండా ఉంటుంది!

నేడు ఆ తండ్రి స్నేహం లేకే… ఆడపిల్లలు తమ మనసులో బాధను దాచలేక, ఆపలేక.. నరకయాతన అనుభవిస్తున్నారు! అనంతర పాత్ర.. సంరక్షకుడు! కూతురు ఎదిగినదగ్గరనుంచి.. ఈ తండ్రి చనిపోయే వరకూ నిత్యమూ సంరక్షకుడే! పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టినా కూడా ఈ సంరక్షణ బాధ్యతలు పోని రోజులివి!

ఇక మగపిల్లాడి తండ్రికి మూడు బాధ్యతలే కీలకం. అవే… స్నేహితుడు.. సేవకుడు.. మార్గదర్శకుడు! బాబు పుట్టినప్పటినుంచీ.. వారసుడు పుట్టాడు అని మురిసిపోతాడు తండ్రి. తాను కొనుక్కున్న రంగు బట్టల వాడికీ కొంటాడు.. బైక్ పై ముందరపెట్టించుకుని.. “మావాడండి” అని చెప్పుకుంటూ తిరుగుతాడు.. ఆడతాడు, పాడతాడు! అనంతరం ఎన్నో సేవలు చేస్తాడు! అవన్నీ ఒకెత్తు అయితే… మరి ముఖ్యంగా పాటించాల్సిన విషయం… మార్గదర్శకుడిగా ఉండటం.

కుమారుడి ప్రవర్తనపై తండ్రి ప్రవర్తన ప్రభావం చాలా కీలకంగా ఉంటుంది. పుట్టినప్పటినుంచీ.. తండ్రిని చూస్తూ పెరిగిన కొడుకు.. కచ్చితంగా ఆ అలవాట్లను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆచరిస్తూనే ఉంటాడు! అంటే… వాడి భవిష్యత్తు ఆ తండ్రి చేర్పించే స్కూళ్లలోనో, కట్టే కాలేజీ ఫీజుల్లోనో ఉండదు… తండ్రి నడవడిక మీద కూడా ఉంటుంది! ఆ విషయం ఏ కుమారుడి తండ్రీ మరిచిపోకూడదు!

సమాజానికి ప్రతీ తండ్రీ ఒక అబ్ధుల్ కలాం ని ఇవ్వవలసిన అవసరం లేదు… ఒక దావూద్ ఇబ్రహీం ని దేశానికి ఇవ్వొద్దు.. ఒక బిన్ లాడెన్ ని సమాజానికి అందివద్దు! నేడు తండ్రిగా ఉన్న నీకు ఈ దేశం ఎన్నో ఇచ్చింది… కాని నువ్వు మాత్రం ఈ దేశానికి ఒక దొంగనో, ఒక బాధ్యత లేకుండా రోడ్లపై బైక్ తోలే కొడుకునో, తాగి రోడ్లపై దొల్లే వారసుడినో, ఏమాత్రం దేశభక్తిలేని వ్యక్తినో, ఒక తిరుగుబోతునో, ఒక స్మగ్లర్ నో, ఒక రేపిస్టునో, ఒక డ్రగ్గిస్టునో రేపటి పౌరుడిగా ఇవ్వకూడదుకదా!

దేశ సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్ ఎంత బాధ్యతగా ఉంటాడో.. నేటి పరిస్థితుల్లో ప్రతీ తండ్రి తన పిల్లల విషయంలో అంతే జాగ్రత్తగా గస్తీ కాయాలి.. వారి భవిష్యత్త్ బాగుండటానికి పహారా కాయాలి!

ఈ విషయాలను గ్రహించిన తండ్రులకు, ఇప్పటికే ఆచరిస్తున్న తండ్రులకు, ఇకపై అయినా ఆచరించాలి అనుకుంటున్న తండ్రులకు… ఫాదర్స్ డే శుభాకాంక్షలు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version