బాధ్యతాయుతంగా నడుచుకోవడానికి కూడా మనకు ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ఏ ప్రయోజనం లేనిదే చివరకు బ్రతకడం కూడా వృధా అనేటంత వ్యాపారాత్మక ధోరణిని అలవర్చుకున్నాం. దాంతో ఎక్కడా తృప్తి మిగలట్లేదు.
బేరసారాలు తలకెక్కక ముందు సమర్థవంతంగా ఏదైనా పనిచేస్తే ఎంతో సంతృప్తిని మూటగట్టుకునే వాళ్లం. ఇప్పుడా సంతృప్తులు ఎక్కడా లేవు. మనం చేసే ఏ పనిలోనూ పరిపూర్ణత గోచరించదు.. అతుకుల బొంతలా ఏదో చేయాలి కాబట్టి చేయడం తప్ప! ఇలాంటి పలాయనవాదంతో జీవిస్తూ మళ్లీ మనకు సమాజంలో దక్కాల్సిన అన్ని హక్కులూ దక్కాలి.
హక్కులు ఒకరిస్తే తీసుకునే భిక్షం వంటివనీ, బాధ్యతలు మనకు మనం మన వంతు చేసే దానాల వంటివనీ గ్రహించగలిగిన రోజున మనవంతు ఏమీ దానం చేయకుండా ఉండిపోతూ, మరోవైపు మొండి చేతుల్ని చాచి అడుక్కోవడానికి మనసొప్పదు.