కరోనా వ్యాక్సిన్ భారత్‌కు వస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం భారత్‌కు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. వ్యాక్సిన్ రెడీ అయిన వెంటనే కోట్ల కొద్దీ డోసులు తెచ్చుకునేందుకు భారత ఫార్మా కంపెనీలు కాచుకుని కూర్చొని ఉన్నాయి. ఇప్పటికే విదేశీ ఫార్మా కంపెనీలకు కోట్ల కొద్ది డబ్బులు కూడా గుమ్మరించాయి. మరోవైపు ధనిక దేశాలకు చెందిన ప్రజలు, ప్రభుత్వాలు కోట్లాది డోసులను ఆర్డర్ చేస్తున్నాయి. ముందుగా వ్యాక్సిన్ ఆయా దేశాలకు వెళ్లిపోయే అవకాశాలు ఉండడంతో మధ్యతరగతి వర్గం ఎక్కువుగా ఉన్న భారతదేశం పరిస్థితి ఏంటి ? మనదేశంలో ధనిక వర్గాలను పక్కన పెడితే మధ్యతరగతి, పేదవర్గాలకు చెందిన ప్రజలకు వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి రాకపోతే వీళ్ల పరిస్థితి ఏంటన్నది అంతుపట్టడం లేదు.
గ్లోబల్ ఫార్మా కంపెనీలు సనోఫీ, జీఎస్‌కేల వ్యాక్సిన్ తయారీ పూర్తి కాగానే, బిలియన్ల డోసులు కొనేందుకు అమెరికా, బ్రిటన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరో ఫార్మా కంపెనీ ఫైజర్‌తో జపాన్ ఇలాంటి డీల్ కుదుర్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా కంపెనీ రెడీ చేసిన వ్యాక్సిన్ సక్సెస్ అవుతోందన్న వార్త తెలిసిన వెంటనే ధనిక దేశాలు అక్కడ వాలిపోయి మాకే ముందు కోట్లాది వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనిని బట్టి ముందు వ్యాక్సిన్ వచ్చినా పేద దేశాలకు, మధ్యతరగతి వర్గాలకు ముందు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు.
ఇక ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఈయూ, జపాన్‌లే ఏకంగా 130 కోట్ల కరోనా ఇమ్యూనైజేషన్ డోసులను కొన్నాయని లండన్‌కు చెందిన ఎయిర్‌ఫినిటీ వెల్లడించింది. మరో 150 కోట్ల డోసుల కోసం చర్చలు జరుగుతున్నాయట. అయితే ఈ వ్యాక్సిన్లు కూడా ఇంకా పూర్తిగా సక్సెస్ అయినట్టు కాదు. ఇవన్నీ ప్రయోగాల దశలోనే ఉన్నాయి. ఇవన్నీ పూర్తయ్యి వ్యాక్సిన్ సక్సెస్ అయ్యాకే ఈ కోట్లాది ఆర్డర్లు డెలివరీ అవుతాయి. అయితే ఇదంతా పూర్తయ్యే సరికి 2022 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే మన దేశంలోకి కరనా వ్యాక్సిన్ వచ్చినా అది ముందుగా పేద ప్రజలకు వచ్చే అవకాశాలు కనపడడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి.