ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ తెలంగాణ లో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు అమెరికాలో మంత్రి కే తారకరామారావు తో జరిగిన సమావేశంలో కంపెనీకి చెందిన చైర్మన్ మరియు సిఇఓ మనీష్ కుమార్ ఈ మేరకు కంపెనీ నిర్ణయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టం ని డెవలప్ చేసేందుకు కంపెనీ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద ఈ మేరకు కంపెనీ తన కార్యకలాపాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రారంభించనుంది. ఫిష్ ఇన్ కంపెనీ చేపల ఉత్పత్తిలో హ్యచరీలు, దాణా తయారీ, కేజ్ కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్ మరియు ఎగుమతుల వంటి అనేక విభాగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తామని కంపెనీ సీఈఓ మనీష్ కుమార్ తెలిపారు.
కంపెనీ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సుమారు 85 వేల మెట్రిక్ టన్నుల చేపలను ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అధికంగా ఉన్న తెలంగాణ యువతకు ముఖ్యంగా మత్స్య పరిశ్రమ పై ఆధారపడిన వారికి, మిడ్ మానేరు నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీకి సూచించారు.