ఈ మధ్య కాలం లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే ప్రతీ ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు క్రెడిట్ కార్డును కానీ డెబిట్ కార్డుని కానీ వాడుతున్నారా..? అయితే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డును హ్యాక్ చేయడానికి కేవలం ఆరు సెకన్ల సమయం సరిపోతుందట. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే..
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డును కేవలం కొన్ని సెకండ్స్ లోనే హ్యాక్ చేస్తున్నారట. కనుక జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మోసగాళ్ల చేతి లో సులభంగా డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. పైగా కరోనా వచ్చినప్పటి నుండి ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. ఎక్కువ మంది డిజిటల్ మార్గంలోనే ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు.
గ్లోబల్ వీపీఎన్ సర్వీసెస్ ప్రొవైడర్ నార్డ్‌వీపీఎన్ అనే సంస్థ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డును సగటున ఆరు సెకన్లలోనే హ్యాక్ చేస్తారని దీని ద్వారా తెలిసింది. 140 దేశాల నుంచి 40 లక్షల కార్డు పేమెంట్లను పరిశీలిస్తే.. బ్రూట్ ఫోర్స్ ద్వారా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు పేమెంట్లను బాగా హ్యాక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవి చాలా వేగంగా జరుగుతాయి.
డార్క్ వెబ్‌లో పెద్ద సంఖ్యలో కార్డు పేమెంట్స్ వివరాలు కనిపించడానికి ముఖ్య కారణం బ్రూట్ ఫోర్స్. క్రిమినల్స్ కార్డు నెంబర్, సీవీవీని వీళ్ళు అంచనా వేస్తారు. తొలి 6 – 8 డిజిట్స్ అనేవి కార్డు ఇష్యూయర్ ఐడీ నెంబర్ అని.. మిగతా 7 – 9 నెంబర్లను హ్యాకర్లు అంచనా వేస్తె చాలని నార్డ్‌వీపీఎన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మరిజూస్ బ్రిడీస్ తెలిపారు.
తొమ్మిది అంకెలను అంచనా వేయడానికి ఒక కంప్యూటర్ ద్వారా ఎన్నో రకాల కాంబినేషన్లను ప్రయత్నించొచ్చని బ్రీడిస్ అన్నారు. గంటకు 25 బిలియన్ కాంబినేషన్‌లను ట్రై చెయ్యచ్చన్నారు. కార్డ్ జారీ చేసే సంస్థపై ఆధారపడి అంచనా వేయాల్సిన అంకెల సంఖ్య కూడా మారుతుందని తెలిపారు. కొన్ని సార్లు ఏడు అంకెలు మాత్రమే అవసరం కావచ్చని.. అప్పుడు ఆరు సెకన్లు సరిపోతాయని… ఈజీగా హ్యాక్ చేసేయచ్చన్నారు.