విమానం ఆలస్యమైనందుకు విమానంలోనే రచ్చ రచ్చ చేసి కాక్ పిట్ తలుపు తెరవాలని ప్రయత్నించిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకొంది. జనవరి 2 న ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా బోయింగ్ 747 విమానం బయల్దేరాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్య కారణంగా ఆ విమానం ఆలస్యం అయింది. ఇదే సమయంలో ఆ సమస్య పరిష్కరించడం కూడా ఆలస్యం కావడంతో ప్రయాణికులు రెచ్చిపోయారు.
విమానంలో ఉన్న క్యాబిన్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కాక్ పిట్ తలుపు తెరవడానికి కూడా ప్రయత్నాలు చేసారు. బోయింగ్ 747 విమానం యొక్క కాక్పిట్ తలుపు తెరుస్తామని బెదిరించారని ఎయిర్ ఇండియా అధికారులు ఫిర్యాదు చేసారు. AI865 విమానం సాంకేతిక సమస్యను పరిష్కరించడంలో గురువారం ఆలస్యం అయింది. ఇది విమానాశ్రయానికి తిరిగి రావలసి వచ్చింది.
అప్పుడే విమానంలో ప్రయాణీకులు కాక్‌పిట్ తలుపు కొట్టడం మొదలుపెట్టి పైలట్‌లను బయటకు రావాలని పిలవడం మరియు బూతులు తిట్టారని అధికారులు పేర్కొన్నారు. పైలట్లు బయటకు రాకపోతే కాక్‌పిట్ తలుపు తెరుస్తానని ఒక ప్రయాణీకుడు బెదిరించారని దీనితో ఉద్రిక్త వాతావరణం విమానంలో చోటు చేసుకుందని వివరించారు. అదే సమయంలో ఒక మహిళ క్యాబిన్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారని,
ప్రధాన గేటును త్వరగా తెరవడానికి ఆమె చేయి పట్టుకు౦దని అధికారులు చెప్పారు. దీనిపై ఎయిర్ ఇండియా స్పందించింది. కొంతమంది ప్రయాణికుల దుష్ప్రవర్తనపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆపరేటింగ్ సిబ్బందిని కోరినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎయిర్ ఇండియా పేర్కొంది. ప్రస్తుత౦ దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.