తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలో మరోసారి మున్నేరువాగుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీనికి తోడు గోదావరికి కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే,గోదావరి వరద ప్రవాహానికి ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రహదారులు ఘోరంగా దెబ్బతిన్నాయి.ఇక దుమ్ముగూడెం మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు చోట్ల ప్రధాన రోడ్లపై గుంతలు ఏర్పడి, కల్వర్టుల మధ్య మట్టి కొట్టుకుపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
ఎగువన నుంచి వస్తున్న భారీ వరద కారణంగా గోదావరి నదిలో వరద ప్రవాహం యొక్క వేగం పెరిగింది. దీంతో భద్రాచలం – దుమ్ముగూడెం వెళ్లే ప్రధాన రహదారి మధ్యలోని తూరుబాక వద్ద ఉన్న కల్వర్టుకు గోదావరి వరద నీరు చేరడంతో ఒక పక్క కుంగిపోయింది. అది గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో మండల అధికారులు అప్రమత్తమై ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా భారీగేడ్లను ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే వాహనదారులు, పాదాచారులు జాగ్రత్తగా వెళ్లాలని సూచనలు చేస్తున్నారు.