ఆహారానికి ఆరోగ్యానికి ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే. ఐతే ఆరోగ్యం అనగానే చాలామంది శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచిస్తారు. మానసిక ఆరోగ్యం గురించి పక్కనపెట్టేస్తారు. పెద్దగా పట్టించుకోరు. అంతా బాగానే ఉన్నా కొందరు ప్రతీదానికీ చికాకు పడుతుంటారు. ఎందుకో తెలియదు చీటికీ మాటికీ విసుక్కుంటారు. అస్సలు ఓపిక ఉండదు. అనుకున్న పని క్షణాల్లో జరిగిపోవాలని చూస్తుంటారు. అలా కాని పక్షంలో అరుస్తారు. ఆందోళన చెందుతారు. ఇదంతా మానసికంగా సరిగ్గా లేకపోవడమే.
ఐతే మనం తీసుకునే ఆహారం మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. ఐతే ఏయే ఆహారాలు మనల్ని మానసికంగా శారీరకంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం.
చేపలు:
సాల్మన్ చేపలో ఉండే విటమిన్లు మెదడు పనితీరుని బాగా మెరుగుపరుస్తాయి. అంతే కాదు శరీర దృఢత్వానికి బాగా పనిచేస్తుంది.
మొలకలు:
మొలకల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మలబద్దకం సమస్య ఉండదు. ఆహారం లైట్ గా ఉండడం వల్ల ఆలోచన తేట పడుతుంది. శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. దానివల్ల మానసికంగా కూడా చురుగ్గా ఉంటారు.
నారింజ:
సిట్రస్ ఫలం అయిన నారింజలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. విటమిన్ స్ వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ కరోనా టైమ్ లో రెగ్యులర్ గా తీసుకోవడం చాలా ఉత్తమం.
క్వినోవా:
క్వినోవాలో ఉండే పీచు, ఐరన్, ప్రోటీన్.. బరువు తగ్గడానికి బాగా సాయపడతాయి. అంతే కాదు దీనివల్ల గుండెకి బాగా మేలు జరుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.
స్వీట్ పొటాటో:
దీన్ని తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో దగ్గర ఒక్కో పేరుతో పిలుస్తారు. కొన్ని చోట్ల రత్నపురి గడ్డ అనీ, కొందరు కంద గడ్డ అని అంటారు. ఐతే ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. అది కంటికి, ఎముకలకి చాలా ఉపయోగపడుతుంది.
గుడ్లు:
గుడ్డులో ఉండే విటమిన్లు కంటి సమస్యలని దూరం చేస్తాయి. అలాగే సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల తాకిడికి గురై చర్మం పాడవకుండా కాపాడతాయి.