మన శరీరంలో నాడీ మండల వ్యవస్థ పలు ముఖ్యమైన విధులు నిర్వర్తిస్తుంది. మన శరీరానికి మెదడుకు నాడీ మండల వ్యవస్థ వారధిగా పనిచేస్తుంది. అందువల్ల నాడీ మండల వ్యవస్థను ఎప్పుడూ పరిరక్షించుకోవాలి. అందుకు గాను సరైన పోషకాలు కలిగిన ఆహారాలను ఎల్లప్పుడూ తీసుకోవాలి. కింద తెలిపిన ఆహారాలను తీసుకోవడం వల్ల మన నాడీ మండల వ్యవస్థ ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. ఆ ఆహారాలు ఏమిటంటే…
అవకాడో
దీంట్లో విటమిన్ డి, కె ఉంటాయి. ఇవి నాడీ మండల వ్యవస్థను పరిరక్షిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వంశ పారంపర్యంగా వ్యాధులు రాకుండా చూస్తాయి. ఈ పండులో విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దీన్ని తరచూ తీసుకుంటే నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరుచుకోవచ్చు.
ఆవు పాలు
ఆవుపాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవన్నీ నాడీ మండల వ్యవస్థకు ఆరోగ్యాన్నిస్తాయి. ఆవు పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు పొటాషియం, విటమిన్ బి, ప్రోటీన్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి. అందువల్ల ఆవు పాలను తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
నట్స్
బాదంపప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్ ను తరచూ తీసుకుంటున్నా నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. వీటిలో ఉండే మెగ్నిషియం మనకు ఎంతగానో మేలు చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది.
తాజా కూరగాయలు, పండ్లు
సీజనల్‌గా లభించే పండ్లతోపాటు తాజా కూరగాయలను కూడా తీసుకుంటుంటే నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. కూరగాయాల్లో విటమిన్ ఎ, సిలతోపాటు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీని నిత్యం తాగడం వల్ల మతిమరుపు వంటి మెదడు సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల నిత్యం గ్రీన్ టీని తాగినా మెదడు ఆరోగ్యం పరిరక్షించబడుతుంది. దీంతోపాటు నాడీ మండల వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉంటుంది.