BIG BREAKING : టీఆర్ఎస్ గూటికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి..!

-

మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా జంపింగ్ ల పర్వం జోరందుకుంటోంది. ఎలాగైనా మునుగోడు లో పాగా వేయాలని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గద్దెనెక్కాలని భావిస్తోన్న బీజేపీకి వరుస షాక్ లు ఎదురవుతున్నాయి. కాషాయ కండువా కప్పుకున్న వారంతా వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇవాళ ఒక్కరోజే బీజేపీ నుంచి ముగ్గురు ముఖ్యనేతలు బయటకు వస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే దాసోజు శ్రవణ్ కుమార్ బీజేపీ నుంచి బయటకు వచ్చారు. పార్టీని వీడుతున్నట్లు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బహిరంగ లేఖ రాశారు. నిన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్ కూడా బీజేపీ నుంచి బయటకు వచ్చారు. ఆ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని.. తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించడం లేదని ఆరోపించారు.

తాజాగా పాలమూరు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా బీజేపీని వీడనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయన టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మళ్లీ సొంతగూటికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ కూడా తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో స్వామి గౌడ్ భేటీ అయ్యారు. మరికాసేపట్లోనే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version