యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నేడు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ నేపథ్యంలో.. రాష్ట్రం నుంచి దాదాపు 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. కాగా, పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు అధికారులు.
అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తప్పని సరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. కాగా, 25 రోజుల్లో ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడుతాయని యూపీఎస్సీ వెల్లడించింది. సెప్టెంబరులో మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. అయితే సివిల్స్ పరీక్ష రాసేవారికి టీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. హాల్‌టికెట్ చూపించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు అధికారులు.