ఇటీవల ఏపీ సీఎం జగన్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీజేపీ మద్దతు కోరిందని.. అందుకు మద్దతు ఇచ్చామని అన్నారు. అయితే.. దీనిపై ఏపీ బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ మేమేం రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరలేదని వ్యాఖ్యానించారు. అయితే సత్యకుమార్ వ్యాఖ్యలను బీజేప అధిష్టానం ఖండించింది. ఈ నేపథ్యంలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైయస్సార్‌సీపీని కోరామని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. మా పార్టీ అగ్రనేతలంతా దీనిపై ఏపీ సీఎం వైయస్ జగన్‌తో స్వయంగా మాట్లాడారని ఆయన తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ఎంపిక చేసుకున్న తర్వాత, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు, అన్ని ముఖ్య పార్టీల నేతలతో మాట్లాడామని, ఆ క్రమంలోనే వైయస్సార్‌సీపీని సంప్రదించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఆ మేరకు ఏపీ సీఎ వైయస్ జగన్‌తో మా పార్టీ అగ్రనేతలంతా స్వయంగా మాట్లాడారని, తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఎవరి మద్దతు కోరలేదని మా పార్టీ ప్రతినిధి అన్నట్లు, పత్రికల్లో వచ్చిందని, అయితే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ప్రకటనతో బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదని గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు.