హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి అరుదైన ఘనత సాధించి. ఐసీఎంఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ అభివృద్ధి చేస్తున్న.. ఇండియన్ క్లినికల్ ట్రయల్ అండ్ ఎడ్యుకేషన్ నెట్వర్క్ కు గాంధీ ఆసుపత్రి ఎంపికయింది. దక్షిణాది రాష్ట్రాలకు రీజినల్ క్లినికల్ ట్రయల్స్ యూనిట్ గా రికార్డు సాధించింది గాంధీ హాస్పిటల్.
దేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం పాలసీలు, కార్యక్రమాల రూపకల్పనకు కావాల్సిన ఆధారాలను క్లినికల్ ట్రయల్స్, ఇతర పరిశోధన ద్వారా తయారు చేసేందుకు ఐసీఎంఆర్, డి హెచ్ ఆర్ సంయుక్తంగా ఇంటెంట్ పేరుతో నెట్వర్క్ ను అభివృద్ధి చేస్తున్నాయి. ఆసక్తి కలిగిన ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇందులో భాగస్వామ్యం కావాలంటూ ఐసీఎంఆర్ ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది.
అన్ని అర్హతలు పరిశీలించిన అనంతరం గాంధీ ఆసుపత్రిని దక్షిణాది కి రీజనల్ క్లినికల్ ట్రయల్ యూనిట్ గా ఎంపిక చేశారు. దీంతో ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే క్లినికల్ ట్రయల్స్ గాంధీ ఆస్పత్రిలోనే జరగనున్నాయి. ఈ అరుదైన ఘనత సాధించడం పై గాంధీ ఆస్పత్రి వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.