రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చెత్త పన్నుపై స్థానికంగా వివాదాలు నెలకొంటున్నాయి.ముఖ్యంగా శ్రీకాకుళం మున్సిపాల్టీ అధికారులతో సహా గ్రామ సచివాలయ సిబ్బంది అనుసరిస్తున్న వ్యూహం సరిగా లేదన్న ఆరోపణలున్నాయి.తాజాగా శ్రీకాకుళం నగరంలో మరో వివాదం రాజుకుంది.స్థానిక కర్ణాటక బ్యాంకుకు ఎదురుగా ఉన్న స్వాతి మెడికల్స్ యజమానికి నెలకు 1500 రూపాయలు చొప్పున నాలుగు నెలలకు ఆరువేల రూపాయలు చెల్లించాలని నిన్నటి వేళ గ్రామ సచివాలయ సిబ్బంది చెప్పివెళ్లా రు.అయితే తనది చిన్న స్థాయిలో జరిగే వ్యాపారం అని, తాను అంత చెల్లించలేనని, ఉన్నతాధికారులతో మాట్లాడి తగ్గించాలని సం బంధిత యంత్రాంగాన్ని వేడుకున్నారు.
వాళ్లు విని అక్కడి నుంచి వెళ్లిపోయి ఇవాళ ఉదయం మెడికల్ షాపు ఎదురుగా డంపర్ ను తీసుకువచ్చి పెట్టారు. షాపు ఎదురుగా ఎక్కడెక్కడో చెత్తను తీసుకువచ్చి వేస్తున్నారని, ఆ విధంగా తన వ్యాపారం పోతుందని, పన్నువసూలు కు సంబంధించి తనకు కాస్త మినహాయింపు ఇవ్వాలని కోరినందుకు ఈ విధంగా మున్సిపల్ సిబ్బంది వేధించడం తగదని షాపు యజమాని వైశ్యరాజు శ్రీనివాస్ వాపోతున్నారు.దీంతో చేసేది లేక ఇవాళ షాపు బంద్ చేసి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి తాను వేడుకున్నా కూడా ఫలితం లేకపోయిందని ఆయన వాపోతున్నారు.