నిన్నటి వేళ హఠాన్మరణం చెందిన గౌతమ్ రెడ్డికి విభిన్ననాయకుడు అన్న పేరుంది.ఆయన చిన్నవయసులోనే లోకం విడిచి వెళ్లినప్పటికీ, తనకు అప్పగించిన బాధ్యతలను ఎంతో నిబద్ధతతో చేపట్టారు. చనిపోక ముందు రోజు వరకూ తన శాఖ (ఐటీ, పరిశ్రమల శాఖ) పనితీరును మెరుగు పర్చేందుకే కృషి చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే విషయమై,దిగ్గజ కార్పొరేట్ సంస్థలను తీసుకువచ్చే విషయమై ఆయన కృషి చేశారు.ఈ క్రమంలోనే వారం రోజుల పాటు దుబాయ్ లో ఆయన పర్యటించారు.ఇండియాకు చేరుకున్నాక నెల్లూరు వెళ్లి తన బంధువుల నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొని, తిరిగి హైద్రాబాద్ కు వచ్చారు.
ఇక రాజకీయ / వ్యక్తిగత జీవితానికి వస్తే ..
ఆయన ఇప్పటిదాకా ఎటువంటి వర్గ రాజకీయాలూ నడిపిన దాఖలాలు లేవు.అవినీతి చేసిన దాఖలాలు లేవు.వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఘటనలూ లేవు. వైఎస్సార్సీపీకి అత్యంత విధేయుడు.వైఎస్ కుటుంబానికి అత్యంత దగ్గరి నేస్తం.ముఖ్యంగా తొలినాళ్లలో జగన్ వెంట నడిచిన కొద్ది మందిలో ఆయన తండ్రి ఒకరు.అటుపై ఆయన కూడా తండ్రి నడిచిన దారిలోనే వెళ్లి, మచ్చలేని నాయకుడిగానే తుదిదాకా ఉన్నారు. కడ దాకా నాన్నకు కానీ,నమ్మి అవకాశం ఇచ్చిన పార్టీ అధినాయకుడికి కానీ ఏనాడూ చెడ్డపేరు తీసుకు రాలేదు. పారిశ్రామిక రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. తమ్ముళ్లు విక్రమ్ రెడ్డి, పృధ్వీ రెడ్డి తో కలిసి కేఎంసీ కాంట్రాక్టు సంస్థను నిర్వహించారు. మంత్రి అయ్యాక సంస్థ బాధ్యతలు మాత్రం సోదరులే చూస్తున్నారు. సొంత నియోజకవర్గం ఆత్మకూరులో నారంపేట పారిశ్రామిక వాడను నెలకొల్పారు.ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి పొలిటీషియన్ గానే కాకుండా గ్రేడ్ 1 కాంట్రాక్టర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఐదు సార్లు ఎంపీగా పని చేశారు.వివిధ హోదాల్లో పదవులు నిర్వహించినా కూడా రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ఉండాలన్నది వారి నమ్మిక అని మేకపాటి కుటుంబ అభిమానులు అంటుంటారు.