రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కందులకు మద్దతు ధర పై రూ.400 బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆయన తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసారు. రాష్ట్రంలో సుమారు -లక్షల ఎకరాల్లో 2.5లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని కానీ ఇప్పటివరకు కందుల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం శోచనీయం అన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బహిరంగ మార్కెట్ లో రైతులు కనీస మద్దతు ధర పొందే అవకాశం లేకుండా పోయిందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా కందులకు మద్దతు ధరకు అదనంగా రూ.400 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చి రైతులను నమ్మించారని ఈ హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. కందులకు మద్దతు ధర రూ.7,550 ఉంది. కానీ బహిరంగ మార్కెట్ లో రూ.6500 నుంచి 6800 మించి క్వింటాల్ కి చెల్లింపు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.