హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. ఇక నుంచి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ సమస్యలు తీరిపోయినట్లే. ఎందుకంటే 15 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, యూఎల్‌సీ సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార మార్గం చూపింది. ఆరు నియోజకవర్గాల పరధిలోని కొన్ని సర్వే నంబర్లను 1998లో 22ఏ (నిషేధిత భూముల) జాబితాలో చేర్చారు. 2008లో ఈ విషయం గుర్తించిన రిజిస్ట్రేషన్లశాఖ అప్పటి నుంచి ఈ సర్వే నంబర్లలోని భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో రిజిస్ట్రేషన్లు జరగక భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
22ఏ జాబితా నుంచి తమ భూములను తొలగించాలని బాధితుల కొన్నేళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్టకేలకు దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో 118 ద్వారా నామమాత్రపు రుసుముతో క్రమబద్ధీకరిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో ‘మన నగరం’ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గజం రూ.250 చొప్పున ఇంటి స్థలాల భూములు రిజిస్ట్రేషన్ ద్వారా క్రమబద్దీకరణ చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు. 100 నుంచి వెయ్యి గజాల వరకు ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. తాజా ఉత్తర్వుల ద్వారా ఎల్బీనగర్, నాంపల్లి, కార్వాన్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, మేడ్చల్ వంటి 6 నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు మేలు జరుగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.