భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం ఉదయం నాటికి 54.3 అడుగులకు నీటిమట్టం చేరింది. అయితే మంగళవారం రాత్రి వరకు గోదావరి నీటిమట్టం 53 అడుగులకు దాటింది. దీంతో అప్రమత్తమైన అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి ముంపు ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచనలు చేశారు.
ప్రస్తుతం భద్రాచలం వద్ద 14,92,679 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో గోదావరి పరిసర ప్రాంతాల్లోని భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని పలు మండలాలు జలదిగ్బంధంలోకి చిక్కుకున్నాయి. భద్రాచలం నుంచి చర్లకు వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు పోటెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే భద్రాచలం నుంచి చత్తీస్‌ఘడ్, ఒడిశా ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తి స్తంభించాయని అధికారులు వెల్లడించారు.