తెలంగాణ సిఎం కేసిఆర్ చేసే రాజకీయం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పరోక్షంగా కలిసొస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన వేసే వ్యూహాలు ఆటోమేటిక్‌గా కాంగ్రెస్ పుంజుకోవడానికి పనికొచ్చేలా కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాక తెలంగాణలో కాస్త కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న విషయం తెలిసిందే. బలమైన క్యాడర్ ఉండటంతో బిజేపిని వెనక్కి నెట్టేసి కాంగ్రెస్ రేసులోకి వస్తుంది.
పైగా ప్రజా సమస్యలపై పోరాటం చేయడం కూడా రేవంత్‌కు కలిసొస్తుంది. అలాగే సిఎం కేసిఆర్ తీసుకునే నిర్ణయాలు పరోక్షంగా రేవంత్‌కు కలిసొస్తున్నాయి. సిఎం కేసిఆర్ అనూహ్యంగా దళితబంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హుజూరాబాద్‌లో బెనిఫిట్ పొందడానికి ఈ కార్యక్రమం తీసుకొచ్చారనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే దళితులకు, గిరిజనులకు అసలు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ చెబుతున్నారు. అలాగే దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరిట భారీ ఎత్తున సభలు పెడుతూ సక్సెస్ అవుతున్నారు.
ఇక రేవంత్ రెడ్డి మొదట నుంచి టిఆర్‌ఎస్-బిజేపి ఒక్కటే అని విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు మద్ధతు వచ్చేలా కొన్ని సంఘటనలు సైతం జరుగుతున్నాయి. తాజాగా సిఎం కేసిఆర్…ఢిల్లీలో మకాం వేసి వరుసపెట్టి బిజేపి పెద్దలని కలుస్తున్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులని కలుస్తున్నారు. అలాగే ఢిల్లీలో టిఆర్‌ఎస్ కార్యలయం కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది. దీంతో బిజేపి-టిఆర్‌ఎస్‌ల మధ్య ఉన్న బంధం బయటపడిందని రేవంత్ మరింతగా హైలైట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు.
ఇక కేసిఆర్ ఢిల్లీలో ఉండటం తెలంగాణ బిజేపి నాయకులకు కూడా నచ్చడం లేదు. వారు పైకి సిఎం, ప్రధానిని కలవడం మామూలే అని చెబుతున్నా లోపల మాత్రం కాస్త కంగారు పడుతున్నట్లే కనిపిస్తోంది. పైగా కేసిఆర్ ఢిల్లీకి వెళ్ళాకే హుజూరాబాద్ ఉపఎన్నిక కూడా వాయిదా పడింది. దీంతో తెలంగాణ బిజేపి నేతల్లో మరింత టెన్షన్ పెరిగింది. ఇక ఈ పరిణామాలు రేవంత్‌కు ప్లస్ అయ్యేలా కనిపిస్తున్నాయి.