రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్‌ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమించడం జరిగింది. 2022-23 యాసంగి సీజన్లో పండించిన జొన్న(హైబ్రిడ్) పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కొనుగోళ్లు చేపట్టాలని మార్క్ ఫెడ్ ఎండీ యాదిరెడ్డి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
అంతేకాకుండా యాసంగి సీజన్లో పండిన మొత్తం 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ.219.92కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామరెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల పరిధిలో జొన్న సాగు చేసిన లక్షల మంది రైతులకు కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది.