ఎంబీబీఎస్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. దేశంలో తొలిసారిగా ఈ విద్యా సంవత్సరం(2022-23) ఎంబీబీఎస్ కోర్సును హిందీ మాధ్యమంలో అందించేందుకు రంగం సిద్ధమైంది. గత ఏడాది నుంచి బిటెక్ ను ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతేడాది ఏపీలోని ఒక కళాశాలతో పాటు మొత్తం 14 కళాశాలలో ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ బోధించేందుకు ముందుకు వచ్చాయి.
ఈసారి ఆ సంఖ్య 20 కి పెరిగింది. తాజాగా హిందీలో ఎంబిబిఎస్ ను అందించేందుకు రెండు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లోని గాంధీ మెడికల్ కళాశాల, ఛత్తీస్గడ్ లోని బిలాస్ పూర్ లోని అటల్ బిహారి వాజ్ పేయి విశ్వవిద్యాలయం దీని అందుబాటులోకి తీసుకురానున్నాయి.
ఎంబీబీఎస్ మొదటి సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే పాఠ్యపుస్తకాలను హిందీలోకి అనువదించారు. వాటిని ఈ నెల 16న భోపాల్ లో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించనున్నారు. ఈ రెండు వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవే. వాటిలో 15% సీట్లను జాతీయ కోట కింద కేటాయించాలి. ఇలాంటి పరిస్థితుల్లో హిందీఏతర రాష్ట్రాలకు సీట్లు వస్తే ఇబ్బంది తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు.