భక్తి భావాన్ని పెంచేలా, సనాతన ధర్మాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చిన్నతనం నుంచే భక్తి భావాని పెంచేలా తిరుమలలో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. గోవింద కోటి రాసిన 25 సంవత్సరాల లోపు యువతీ, యువకుల కుటుంబాలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. అలాగే 10 లక్షల 1,116 సార్లు గోవింద కోటి రాసిన భక్తులకు బ్రేక్ దర్శనం కల్పిస్తామని తెలిపింది. విద్యార్థినీ విద్యార్థుల్లో ఆధ్యాత్మికత పెంచేలా రాష్ట్రంలో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలకు 20 పేజీల భగవద్గీత పుస్తకాని పంపిణీ చేస్తామని పాలకమండలి సభ్యులు తెలిపారు.
పాలకమండలి తీసుకున్న ఇతర నిర్ణయాలను కూడా భూమన మీడియాకు తెలిపారు. తిరుపతిలో పాత సత్రాలను తొలగించి, అధునాతనమైన రెండు వసతి సముదాయాలను నిర్మించనున్నట్టు వెల్లడించారు. అచ్యుతం, శ్రీ పథం పేరిట ఒక్కో అతిథి గృహానికి రూ.300 కోట్లు కేటాయించి నిర్మాణం చేపడతామని వివరించారు. భైరాగి పట్టడి, కేశవాయన గంటా ప్రాంతాల్లో రహదారుల ఆధునికీకరణకు రూ.135 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. టీటీడీలో 413 ఉద్యోగాల భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని భూమన వెల్లడించారు.