తెలంగాణలో యూరియా కోసం రైతులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికలల్లోనూ నిన్నటి నుంచి రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా పేర్కొన్నారు. ముందుగానే రైతులకు టోకెన్లు జారీ చేయడంతో వారికి పంపిణీ సజావుగా సాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.

జియో పొలిటికల్ ఉద్రిక్తతలు, దేశ ఉత్పత్తి తగ్గడంతో యూరియా కొరత భారీగా ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాగా, గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలో రైతులు యూరియా కోసం ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది లైన్లలో నిలబడి కొట్టుకున్న సంఘటనలు కూడా జరిగాయి. మరి కొంతమంది చిన్నపిల్లలు, వృద్ధులు యూరియా కోసం లైన్లలో నిలబడ్డారు. ఇకనుంచి యూరియా కొరత ఉండదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.