ఏపీ సీఎం జగన్ రైతులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో రైతు భరోసా కౌలు రైతులకు కూడా ఇవ్వాలని జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కౌలు రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకునే విషయంలో అవగాహన లేక చాలా మంది ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వచ్చింది. అగ్రికల్చర్ మిషన్ సమీక్షా సమావేశం సందర్భంగా ఈ అంశంపై చర్చ జరిగింది.
దీంతో రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పిన జగన్.. వైయస్‌ఆర్ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్న కౌలు రైతులకు మరో నెల రోజుల గడుపు పెంచాలని నిర్ణయించారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశం వివరాలను అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మీడియాకు వివరించారు.
వైయస్‌ఆర్ రైతు భరోసాతో 43 లక్షల మంది రైతులకు సాయం అందించామని అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి చెప్పారు. కౌలు రైతుల విషయంలో భూరికార్డుల సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని నాగిరెడ్డి అన్నారు.
పత్తి కొనుగోళ్లకు సీసీఐ సెంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. పొలంబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని నాగిరెడ్డి తెలిపారు. వేరుశనగకు కూడా త్వరలో సీసీఐ తరహా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ధరల స్థిరీకరణ విషయంలో నిరంతరం సమీక్ష చేస్తున్నామన్నారు. బయో ప్రొడక్ట్స్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని రైతులు మొరపెట్టుకుంటున్నారన్నారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు.