హుజురాబాద్ ఉప ఎన్నిక ముంచుకొస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్.. ఆ నియోజకవర్గ ప్రజలపై వరాల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే దళిత బంధు పథకాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్.. తాజాగా కరీంనగర్ కలెక్టర్ మరియు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దళిత జాతి సముద్దరణలో భాగంగా, దళిత బంధు పథకం అమలుతో పాటు, దళిత వాడలల్లో మిగిలివున్న, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులకు సీఎం కెసిఆర్ ఆదేశించారు.
అలాగే.. వారం పది రోజుల్లో హుజూరాబాద్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి , అసైన్డ్ సహా దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కారం చేయాలని… కలెక్టర్ కర్ణన్ కు సీఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. హుజూరాబాద్ లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండొద్దని పేర్కొన్న సీఎం కేసీఆర్… వందశాతం పూర్తి కావాలని తెలిపారు. హుజూరాబాద్ లో ఖాళీ జాగలు వున్న వారికీ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని తెలిపారు. దశల వారీగా తెలంగాణ వ్యాప్తంగా దళితులకు అమలు చేస్తామని ప్రకటించారు సీఎం కెసిఆర్.