ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కరోనా నేపథ్యంలో అనేక మంది గూగుల్ ఉద్యోగులు ఇండ్ల నుంచే పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ఉత్పత్తులు, ఇతర అడ్వాన్స్‌డ్ పరికరాలు ఇండ్లలో ఉండవు. అందుకని ఆయా పరికరాలను కొనుగోలు చేసి ఇండ్లలో వాటిని వాడేందుకు గాను గూగుల్ ఆ మొత్తాన్ని తన ఉద్యోగులకు అందజేయనుంది. కేవలం ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఒక్కొక్కరికీ 1000 డాలర్లు అందజేస్తున్నామని గూగుల్ తెలియజేసింది.
కాగా ఈ విషయంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారని, వారికి అవసరమైన ల్యాప్‌టాప్‌లు, ఇతర హార్డ్‌వేర్ పరికరాలను కొనుగోలు చేసుకునేందుకు ఒక్కొక్కరికీ 1000 డాలర్లను అందిస్తున్నామని తెలిపారు. దీంతో వారు వాటిని కొనుగోలు చేసి ఇంటి నుంచి మరింత సులభంగా పనిచేయచవచ్చని ఆయన తెలిపారు.
ఇక ప్రస్తుతానికి గూగుల్‌కు చెందిన అనేక మంది ఉద్యోగులు ఇండ్ల నుంచే పనిచేస్తున్నా.. వర్క్ ఫ్రం హోం అన్నది శాశ్వతం కాదు కనుక.. గూగుల్ జూలై నెల నుంచి తమ కార్యాలయాలు ఉన్న నగరాలలో నెలకొన్న కరోనా తీవ్రతను బట్టి వాటిని ఓపెన్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అనువుగా ఉన్న చోట ఉద్యోగులను పరిమిత సంఖ్యలో, భౌతిక దూరం పాటిస్తూ, రొటేషన్ పద్ధతిలో ఆఫీసులకు రప్పించాలని గూగుల్ ఆలోచిస్తోంది.