కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో మే 29 అని ముందుగా ప్రకటించారు. కానీ కేంద్రం మే 31 అన్నాక ఆ తేదీ వరకు రాష్ట్రంలోనూ లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఇక అదే సందర్భంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగుపై కూడా కీలక ప్రకటన చేశారు. అయితే అదే విషయంతోపాటు మరిన్ని విషయాలపై కేసీఆర్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన మరికాసేపట్లో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
సీఎం కేసీఆర్ అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మరికాసేపట్లో ఆ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, లాక్‌డౌన్ సడలింపులతోపాటు జూన్ 2వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలపై కూడా కేసీఆర్ అధికారులకు సూచనలు చేయనున్నట్లు తెలిసింది. అలాగే రాష్ట్రంలో రైతులను ప్రోత్సహించడంతోపాటు వారిని ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేసే విధంగా సమాయాత్తం చేసేందుకు అధికారులతో కేసీఆర్ చర్చించనున్నారని సమాచారం.
ఇక త్వరలో వర్షాకాలం సీజన్ కూడా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతులకు కావల్సిన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చూడాలని కూడా కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇక దేశవ్యాప్త లాక్‌డౌన్ మే 31న ముగుస్తుండడంతో ఆ తరువాత రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ప్రస్తుతం పెరుగుతున్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, లాక్‌డౌన్ 5.0ను అమలు చేస్తే ఎలాంటి ఆంక్షలకు సడలింపులు ఇస్తారు, దానిపై ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది.. వంటి అంశాలను కూడా కేసీఆర్ అధికారులతో సమీక్షా సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. అయితే సమావేశం అనంతరం కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుంగా, లేదా.. అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు.