ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు చేయూత నిచ్చేందుకు ప్రారంభించిన ప్రతిష్ఠాత్మక పథకం ‘అమ్మ ఒడి’ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వివిధ శాఖల నుంచి రూ. 6,109 కోట్ల విడుదలకు అనుమతి ఇచ్చింది. ఈ పథకం కింద ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తమ పిల్లలను పాఠశాలకు పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకాన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలతో నిమిత్తం లేకుండా 75 శాతం హాజరు కలిగిన ప్రతి విద్యార్థికి వర్తింపచేయనున్నారు.
బీసీ కార్పొరేషన్ నుంచి రూ.3,432 కోట్లు, కాపు కార్పొరేషన్ నుంచి రూ.568 కోట్లు, మైనారిటీ సంక్షేమశాఖ నుంచి రూ.442 కోట్లు, గిరిజనశాఖ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.395 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.1,271 కోట్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కాగా ‘అమ్మ ఒడి’ కి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఆఖరి అవకాశం ఇచ్చింది. ఇప్పుటివరకు నమోదు చేసుకోనివారు ఎవరైనా ఉంటే..జనవరి 5 వ తేదీ సాయంత్రం 5 గంటలోగా..సంబంధిత అధికారులకు దరఖాస్తు సమర్పించాలని స్పష్టం చేసింది.