పెళ్లయిన రెండు రోజులకే వరుడు కరోనా వైరస్ తో మరణించిన విషాద ఘటన బీహార్ రాష్ట్రంలోని పాలిగంజ్ పట్టణ సమీపంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రంలోని దీహపాలికి గ్రామానికి చెందిన యువకుడు గురుగ్రామ్ లో (30) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పెళ్లి కోసం మే 12న గ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడు కరోనా బారినపడినా గుర్తించలేకపోయాడు. పాలిగంజ్ సమీపంలోని ఓ గ్రామంలో ఈ నెల 15న ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రెండు రోజులకే వరుడి ఆరోగ్య క్షీణించడంతో అతన్ని పట్నాలోని ఎయిమ్స్ కు తీసుకువెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు.
వివాహానికి 50 మంది అతిథులను మాత్రమే అనుమతించాలని, వేడుకలో సామాజిక దూరం పాటించాలనే నియమాలను ఉల్లంఘించడంతో..పెళ్లికి వచ్చిన అతిథులకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 95 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా వధువుకు కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ అని వచ్చింది. ఈ పెళ్లి వల్లనే అత్యధికంగా 95 మందికి కరోనా వ్యాపించిందని తేలడంతో జిల్లా అధికారులు అప్రమత్తమై వారందరినీ క్వారంటైన్ కు తరలించారు.