సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కేవలం నాలుగేళ్లలోనే 15 టీఎంసీల సామర్థ్యంతో కొండ పోచమ్మ రిజర్వాయర్ ను నిర్మించారు. అయితే ఈ ఉదయం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండిపడింది. జలాశయం నుంచి బయటపడిన నీరు గ్రామాన్ని ముంచెత్తింది. పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు కాలువకు నీటి విడుదలను ఆపివేశారు. ఉదయం పూట ఈ ఘటన జరిగింది కాబట్టి సరిపోయిందని, అదే రాత్రివేళ అయితే పెను నష్టం జరిగి ఉండేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కాల్వ లైనింగ్ పనుల్లో క్వాలిటీ లేకపోవడం, ఎగువన కురిసిన వర్షాలకు వచ్చే వరదను అంచనా వేయకుండా నీటి పంపింగ్ కొనసాగించడమే గండికి కారణమని తెలుస్తోంది.