రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. గురువారం సాయంత్రం 5 గంటలకు గడువు ముగిసిందని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. నోటిఫికేషన్‌లో మొత్తం 783 పోస్టులు ప్రకటించారు. గడువు ముగిసే సమయానికి వాటికోసం రాష్ట్రవ్యాప్తంగా 5,51,901 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటికి జనవరి 18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. చివరి మూడు రోజుల్లో 1.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గడువు ముగిసే సమయానికి చివరి 24 గంటల వ్యవధిలో 68 వేలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం.
గడువు ముగియగానే టీఎస్‌పీఎస్సీ ‘ఆన్‌లైన్’ లింకును తొలగించింది. కొందరు అభ్యర్థుల ఫీజు చెల్లింపులు సర్వర్ నుంచి ఖరారైన తరవాత మొత్తం దరఖాస్తుల సంఖ్యలో స్వల్పమార్పులు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. నిర్దేశిత గడువులోపు కమిషన్‌కు అందిన దరఖాస్తుల ప్రకారం ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీ పడనున్నారు. గ్రూప్-2 దరఖాస్తు గడువు ముగియడంతో పరీక్ష తేదీ ఖరారుపై టీఎస్‌పీఎస్సీ సమాలోచనలు చేస్తోంది.