మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి ఇస్రో రెడీ అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 23న బాహుబలి రాకెట్.. జీఎస్ఎల్వీ-మార్క్ 3 (ఎల్వీ-ఎం3)ను అంతరిక్షంలోకి లాంఛ్ చేయనుంది. దీనికి సంబందించిన కౌంట్ డౌన్ నిన్న అర్ధరాత్రి 12.07 గంటలకు షురూ అయింది.
అన్నీ సజావుగా జరిగితే ఇవాళ అర్ధరాత్రి 12.07 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రైవేట్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ వన్ వెబ్‌కి చెందిన 36 బ్రాడ్ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్లను ఈ రాకెట్ ద్వారా రోదసిలోకి పంపనున్నట్లు వెల్లడించారు. 5,200 కిలోల బరువు కలిగిన ఈ 36 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
రాకెట్ భూమి నుంచి ఎగిరిన అనంతరం 16.21 నిమిషాల్లో ఈ రాకెట్.. 36 ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడుతుంది. ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరిన అనంతరం యూకేకి చెందిన గ్రౌండ్‌స్టేషన్ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకుంటారని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.