కొన్నాళ్ల వరకు జెలన్ స్కీ అనే పేరు ప్రపంచంలో పెద్దగా ఎవరికీ తెలియదు. ఉక్రెయిన్ కు ప్రెసిడెంట్ అయిన ఆయన గురించి తెలిసింది ప్రపంచానికి కొంతే. అయితే ఎప్పుడైతే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కావడంతో జెలన్ స్కీ పేరు ప్రపంచం మొత్తం మారుమోగుతోంది. అత్యంత బలమైన రష్యాను ఎదురించి వార్తల్లో నిలిచారు.
కేవలం మూడు నాలుగు రోజుల్లోనే ఉక్రెయిన్, రష్యాకు లొంగిపోతుందని అనుకున్నా… ఏకంగా మూడు వారాల నుంచి బలమైన రష్యన్ ఆర్మీని ఎదురొడ్డి నిలుస్తోంది. యుద్ధం ప్రారంభం అయినప్పుడు తన సైన్యాన్ని ఉత్తేజపరిచేందుకు స్వయంగా సైనిక దుస్తులు ధరించి.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో తిరుగుతూ.. తన దేశ ప్రజల్లో ఉత్తేజాన్ని నింపాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా జెలన్ స్కీపై ప్రశంసలు కురుస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ అసెంబ్లీ, అమెరికా చట్ట సభలు జెలన్ స్కీ ప్రసంగాలకు స్టాండింగ్ ఓవేషన్లు ఇచ్చారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం జెలన్ స్కీకి ఓ గౌరవం దక్కింది. గౌహతికి చెందిన అరోమికా టీ యజమాని రంజిత్ బారుహ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్ స్కీని గౌరవించడానికి కొత్త టీ బ్రాండ్ కు ‘జెలన్ స్కీ’ అని పేరు పెట్టారు. బలమైన రష్యా బలగాలతో ఒంటిచేత్తో పోరాడుతున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ బలం, ధైర్యం కారణంగా మా టీకి ఈ పేరుపెట్టామని.. ప్రజలు ఇష్టపడతారని రంజిత్ అన్నారు.