ఇరువురి భామల కౌగిలిలో స్వామీ.. ఇరుకున పడి నీవు నలిగితివా.. అనే పాటలో ఉన్న లిరిక్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఓ వ్యక్తికి కరెక్ట్‌గా సూట్ అవుతాయి. ఎందుకంటే అతడు కూడా ఇద్దరు భార్యల నడుమ నలిగిపోతున్నాడు. తన కోసం ఇద్దరు భార్యలు గొడవపడుతుంటే చూడలేక చివరకు కోర్టును ఆశ్రయించాడు. మరి కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే..?
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం హరియాణాలోని మల్టీనేషనల్ కంపెనీలో ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి 2018లో గ్వాలియర్ ప్రాంతానికి చెందిన మహిళతో వివాహమైంది. 2020లో లాక్డౌన్ విధించినప్పుడు తన భార్యను పుట్టింటికి పంపాడు. లాక్డౌన్ ఎత్తివేసినా కూడా ఆ తర్వాత ఆమెను తీసుకెళ్లలేదు. అంతేకాకుండా హరియాణాకు వెళ్లి తన కంపెనీలో ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.
ఏళ్లు గడుస్తున్నా తన భర్త తనని తీసుకెళ్లడం లేదని అనుమానమొచ్చిన మొదటి భార్య హరియాణాకు వెళ్లే సరికి తన భర్త రెండో పెళ్లి విషయం బయటపడింది. న్యాయం కోసం ఆమె గ్వాలియర్‌లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా వారికి ఆరు నెలలపాటు కౌన్సెలింగ్ ఇచ్చింది ముగ్గురికి సయోధ్య కుదిర్చారు. వారంలో ఒక్కో భార్య దగ్గర మూడ్రోజులు ఉండాలని.. ఆదివారం తన ఇష్టమని భర్తకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ తీర్పు తర్వాత ఆ భర్త తన భార్యలిద్దరికీ చెరో ఫ్లాట్ కొనిచ్చాడు.