మొత్తానికి అటు తిప్పి ఇటు తిప్పి టీడీపీతో కలిసే ఎన్నికలకు వెళ్తామని పవన్ క్లారిటీ ఇచ్చేశారు. అసలు డైరక్ట్ గా ఎక్కడ టీడీపీతో పొత్తు ఫిక్స్..ఇన్ని సీట్లు ఫిక్స్ అని చెప్పలేదు. కానీ ఆయన మాట్లాడే ప్రతి మాట టిడిపితో పొత్తుకు రెడీ అనే సంకేతాలు స్పష్టంగా వచ్చాయని చెప్పవచ్చు. అలాగే ఇంకా బిజేపికి గుడ్ బై చెప్పేసినట్లే అని తెలుస్తోంది.
జనసేన 10వ ఆవిర్భావ సభ మచిలీపట్నంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సభ ముగిసే సరికి రాత్రి 12 అయిన..జనసేన శ్రేణులు, ప్రజలు అలాగే ఉండిపోయారు. ఎంత ఆలస్యం అయిన పవన్ కోసం నిలబడ్డారు. దీని బట్టి చూస్తే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్ధమవుతుందనే చెప్పాలి. ఇక ఆవిర్భావ సభలో వైసీపీ వైఫల్యాలపై పవన్ విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో వైసీపీకి కౌంటర్లు ఇచ్చి..పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. ఈ సారి ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోదని, ఈసారి ప్రయోగాలు చేయబోమని, అసెంబ్లీలో అడుగుపెట్టేలాగే తమ వ్యూహం ఉంటుందని తెలిపారు.
మీరు సీఎం సీఎం అని నినాదాలు చేస్తున్నారని, కానీ మీరంతా జనసేనకు అండగా ఉంటామని సంపూర్ణమైన నమ్మకం వచ్చి, క్షేత్రస్థాయిలో సమాచారం తెప్పించుకుని, అధ్యయనం చేసి, జనసేన గెలుస్తుందంటే ఒంటరిగా వెళ్లడానికి తాను వెనుకాడనని తెలిపారు. అంటే జనసేనకు ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసే బలం లేదని చెప్పకనే చెప్పారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. బిజేపితో కలిసి పనిచేద్దామంటే..ఆ పార్టీ ముందుకురాలేదని అన్నారు.
టీడీపీ మీద తనకు ప్రత్యేక ప్రేమ లేదని, చంద్రబాబు మీద ఆరాధనా భావం లేదని, కానీ ఆయనమీద గౌరవముందని, ఆయన సమర్థుడని అన్నారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీచేయాలని వైసీపీ అంటోందిని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఒకటి కోరుకుంటోందని, కానీ అది జరగనివ్వనని అన్నారు. అంటే వైసీపీ…టిడిపి-జనసేన పొత్తు ఉండకూడదని భావిస్తుంది..కానీ పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెడతామని పవన్ పరోక్షంగా చెబుతున్నారు.
మొత్తానికి టిడిపితో కలిసి పోటీ చేయడానికి పవన్ రెడీ అయ్యారు..అటు బిజేపికి గుడ్ బై చెప్పేశారని చెప్పవచ్చు. అదే సమయంలో టిడిపితో పొత్తుకు సిపిఐ కూడా రెడీగా ఉంది. మొత్తానికి టిడిపి-జనసేన-సిపిఐ కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది.