హరీష్ రావు తొందరపడుతున్నారా? నెగిటివ్ అవుతుందా?

-

హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతున్న విషయం తెలిసిందే. హుజూరాబాద్‌లో గెలవడానికి ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ, ప్రత్యర్ధులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ హుజూరాబాద్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టాలని చెప్పి వ్యూహాత్మకంగా వెళుతుంది. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లో మకాం వేసి పార్టీని గెలిపించడానికి కష్టపడుతున్నారు. అటు సీఎం కేసీఆర్ సైతం, హుజూరాబాద్‌పై వరాలు కురిపిస్తున్నారు. వేల కోట్లతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.

harish rao | హరీష్ రావు

అలాగే ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకులని పార్టీలోకి తీసుకుంటున్నారు. ఇక ట్రబుల్ షూటర్‌గా ఉన్న హరీష్ రావు సైతం, హుజూరాబాద్‌లో పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్నారు. అయితే ఎప్పుడు వ్యూహాత్మకంగా ముందుకెళ్లే హరీష్ ఇప్పుడు ఈటల విషయంలో తొందరపడుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హుజూరాబాద్‌లో గెలుపు కోసం గత కొన్నిరోజులుగా పాదయాత్ర చేసిన ఈటల ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న ఈటల కాలుకు సర్జరీ జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై హరీష్ స్పందిస్తూ… హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ వీల్‌చైర్‌ ద్వారా ప్రజల్లో ప్రచారం నిర్వహించేందుకు రాబోతున్నారని, తమకు గాయాలు అయినట్లు, అనారోగ్యానికి గురైనట్లు, ఒళ్లంతా పట్టీలు కట్టుకొని తిరుగుతూ సానుభూతి పొందడం బీజేపీ ప్రచార ప్రణాళికలో ఓ ఎత్తుగడ అని విమర్శించారు.

అయితే బీజేపీ ప్రణాళిక ఏమో గానీ, ఈటల విషయంలో మాత్రం హరీష్ తొందరపడి మాట్లాడినట్లున్నారని అంటున్నారు. పరిస్తితి ఏదైనా ఈటల అనారోగ్యంతో ఉన్నారని తెలుస్తోందని, ఇలాంటి సమయంలో ఆయన ఆరోగ్యం గురించి విమర్శలు చేయడం మంచిది కాదనే వాదన ఎక్కువగా వస్తుంది. హరీష్ లాంటి వారు కూడా ఇలా మాట్లాడితే అది టీఆర్ఎస్‌కే నష్టం అవుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version