ఈ సారి హోళీ ఆడకపోవడమే ఉత్తమం.. దేశ ప్రజలకు ఆరోగ్య నిపుణుల సలహా!

-

హోళీ పండుగ! భారతీయులు అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో ఒకటి. అయితే, ఇటీవల చైనాలో పడగ విప్పి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కొవిడ్‌-19 (కరోనా వైరస్‌).. ఈసారి హోళీ వేడుకలపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో హోళీ సంబురాలు జరుపుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. హోళీ రంగులు పూసుకోవడం ద్వారా కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వేగంగా విస్తరించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

‘సాధారణంగా శ్వాసవ్యవస్థను దెబ్బతీసే కరోనా లాంటి వైరస్‌ తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. ముక్కు, నోటిలో ఉండే ద్రవాలు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్ల రూపంలో బయటకు వస్తాయి. అయితే, హోళీ సందర్భంగా జనం గుంపులు గుంపులుగా చేరి ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటారు. దీంతో ఒకరి నోరు, ముక్కులోని ద్రవాలు మరొకరి చేతులకు తుంపర్లుగా కాకుండా ఎక్కువ మోతాదులో అంటుకుంటాయి. ఇలా అంటిన చేతులతో అందరికీ రంగులు పూస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడంవల్ల ఆ గుంపులోని ఏ ఒక్కరిలో కరోనా ఉన్నా అది అందరికీ అంటుకునే ప్రమాదం ఉంది’ అని నిపుణులు వార్నింగ్‌ ఇస్తున్నారు.

దేశంలో కరోనా మరింత విస్తరించకుండా ఉండాలంటే.. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించడంతోపాటు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకరినొకరు కలువాల్సి వచ్చినప్పుడు వ్యక్తికి, వ్యక్తికి మధ్య కనీసం ఆరడుగుల దూరం పాటించాలని.. కౌగిలింతలు, కరచాలనాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వ్యాధి ప్రభావం ఉన్న ప్రాంతాల్లో జనం తప్పనిసరిగా మాస్కులు వినియోగించాలని వారు సలహా ఇస్తున్నారు.

అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రమాదకరంగా ఉంటుంది కానీ, ఒక వ్యక్తికి ఆ వైరస్‌ సోకినప్పుడు ప్రాథమిక దశలో గుర్తిస్తే అంత ప్రమాదమేమీ ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఏకకాలంలో కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 39 కరోనా కేసులు నమోదయ్యాయని, ఈ సంఖ్య మరింత పెరుగకుండా ఉండాలంటే.. ఎవరికి వారు తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని వారు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version