ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లో వరద బాధితులను కాపాడే ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. విజయవాడ కలెక్టరేట్‌లో ఆయన పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. ‘ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ప్రజలకు హమీ ఇచ్చా. దానిని నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలి. బాధితుల కోసం కళ్యాణ మండపాలు, పునరావాస కేంద్రాలు సిద్దం చేయాలి. మినరల్ వాటర్, ఆహారం అందించాలి. వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా చూడాలి’ అని ఆదేశించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల ధాటికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. సామాన్య ప్రజలు వరదల్లో చిక్కుకుని తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు.సహాయక బృందాలు రంగంలోకి దిగి చర్యలు చేపడుతున్నా చాలా ప్రాంతాల్లో వరద నీరు ఏకంగా ఇళ్లను ముంచేశాయి. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు కేంద్రం సహాయం కోరినట్లు సమాచారం.