గత కొద్ది రోజుల కిందటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురిశాయి. అయితే ప్రస్తుతం అవి పత్తా లేకుండా పోయాయి. కాగా ఇవాళ, రేపు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.
గత కొద్ది రోజుల కిందటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురిశాయి. అయితే ప్రస్తుతం అవి పత్తా లేకుండా పోయాయి. కాగా ఇవాళ, రేపు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలోని వాయువ్య ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడుతుందని అధికారులు ముందుగా చెప్పారు. అందుకు తగిన విధంగానే నిన్న అల్పపీడనం ఏర్పడింది. దీంతోపాటు 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో మంగళ, బుధ వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
కాగా సోమవారం ఏపీ, తెలంగాణలలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురవగా, తెలంగాణలోని కొమ్మెరలో 39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే హత్నూరలో 29.3 మి.మీ., కల్హేర్‌లో 22.3 మి.మీ., ఇబ్రహీంపేటలో 20.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఇవాళ, రేపు భారీ వర్షాలు పడుతాయని తెలియడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ముంపు ప్రాంతాల్లో నివాసం ఉండే వారిని తరలించే చర్యలు చేపట్టారు.
ఇక ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా లంక గ్రామాలకు భారీ వరదల నుంచి ఇప్పుడిప్పుడే ఉపశమనం లభిస్తోంది. మరోవైపు వరద తగ్గడంతో ఆయా గ్రామాలకు చెందిన వారు ఇప్పుడిప్పుడు రోజువారీ పనులు చేసుకుంటూ ఇండ్ల నుంచి బయటకు వస్తున్నారు. అయితే చాలా వరకు ఇండ్లలో బురద పేరుకుపోవడంతో గ్రామస్థులు ఇండ్లలో నివసించలేకపోతున్నారు. ఈ క్రమంలో వారి పరిస్థితి మెరుగయ్యేందుకు మరికొద్ది రోజులు పట్టవచ్చని తెలుస్తోంది.