బెంగళూరులో దంచికొట్చిన వాన.. పలు ప్రాంతాలు జలమయం..

-

కర్ణాట‌క రాజధాని బెంగళూరులో ఎడ‌తెరిపిలేకుండా బుధవారం సాయ‌త్రం నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో న‌గ‌రంలోని రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. చాలా చోట్ల మొకాళ్ల మ‌ట్టం వ‌ర‌కు నీరు నిలిచిపోయింది. ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురియడంతో అనేక చోట్ల చెట్లు నేల‌కూలగా.. ఇండ్లు నీట మునిగాయి. ఈ భారీ వర్ష ప్రభావం కారణంగా డ్రైనేజీలు, కాలువలు పొంగి పొర్లాయి. వీధులన్నీ చెరువులను తలపించాయి. వెంట‌నే అప్ర‌మ‌త్తమైన అధికార యంత్రాంగం చ‌ర్య‌లు చేప‌ట్టింది.

అయితే మంగళవారం కురిసిన వర్షాలకు ఇద్దరు కార్మికులు మృతి చెందారు. రాజధానిలోని కొన్ని వర్షాల ప్రభావిత ప్రాంతాలను క‌ర్ణాట‌క‌ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సందర్శించి.. పని చేస్తూ మరణించిన ఇద్దరు వలస కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ విష‌యంలో నిర్లక్ష్యానికి పాల్పడినందుకు కాంట్రాక్టర్‌ను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. సైట్ ఇంజనీర్ పాత్రను తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించారు.

కాగా, కోస్తా జిల్లాలైన దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపిలలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జల్లుల కారణంగా బెంగళూరులో వేలాది ఇళ్లు ముంపునకు గురవుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇళ్లు నీట మునిగిన వారికి సీఎం బొమ్మై రూ.25 వేలు పరిహారం ప్రకటించారు. గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 50 మి.మీ నుంచి 150 మి.మీ వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. హోరామావు, యెలహంక, విద్యాపీఠం, రాజమహల్, నాగపుర, సంపంగిరాంనగర్, విద్యారణ్యపుర, బాణసవాడి, జక్కూరు, సింగసంద్ర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కుండపోత వర్షాల మధ్య చెట్లు కూడా నేలకొరిగాయని బెంగళూరు పౌరసరఫరాల సంస్థ తెలిపింది. భారీ వర్షాల మధ్య బెంగళూరులోని పలు ప్రాంతాలు జలమయమై ట్రాఫిక్ జామ్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version