పరిశ్రమలకు సంబంధించి ఈ ఏడాది లో ఈ వేసవిలో చాలా ఇబ్బందులు తలెత్తాయి అన్నది వాస్తవం. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఉత్పత్తి తగ్గిపోవడం, బయట మార్కెట్లో ఆన్ డిమాండ్ యూనిట్ ధర పీక్ అవర్స్ లో 8 నుంచి 12 రూపాయలు పలుకుతుండడం వగైరా వగైరా కారణాలతో కొంత విద్యుత్ కొరత ఏర్పడింది.. కోతలు తలెత్తాయి. వీటిని అధిగమించేందుకు జగన్ సర్కారు చేసిన కొన్ని ప్రయత్నాలు, ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలే ఇచ్చాయి. దీంతో అప్పటి కన్నా ఇప్పుడు సమస్య పరిష్కారానికి నోచుకుంది.
ఇకపై పరిశ్రమలకు కోతలు విధించడం అన్నది జరగని పని అని తేలిపోయింది. విద్యుత్ శాఖ మంత్రి కూడా ఇదే మాట పదే పదే చెబుతున్నారు. ఇటీవల కాలంలో విద్యుత్ సరఫరాలో తలెత్తిన కొన్ని అవంతరాలను అధిగమించేందుకు, గృహావసరాలకు నిరంతరాయంగా విద్యుత్ ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కొన్ని నిర్ణయాల కారణంగా పరిశ్రమ వర్గాలు తమ ఇబ్బందిని సంబంధిత యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి కూడా సానుకూలంగా ఉంటూ ఎప్పటికప్పుడు కోతల నివారణకు సంబంధించి చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు డిస్కం వ్యవస్థ కూడా మెరుగుపడింది.
దీంతో నిరంతరాయ సరఫరా అన్నది సాధ్యం అని తేలిపోయింది. ఏదేమయినప్పటికీ విద్యుత్ పొదుపునకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరిగినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజూ 195 మిలియన్ యూనిట్లకు పైగా పరిశ్రమలకు సరఫరా చేసేందుకు సర్కారు నిర్ణయించడంతో ఇకపై పరిశ్రమలకు విద్యుత్ కష్టాలు అన్నవి ఉండనే ఉండవు అని సంబంధిత వర్గాలు హామీ ఇస్తున్నాయి.