భాగ్యనగరంలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ , బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వార్, బొల్లారం, జేబీఎస్, మారేడ్‌పల్లి, పాట్నీ సెంటర్‌లో మోస్తరు వర్షం కురిసింది. చిలుకలగూడ, గుండపోచంపల్లి, కొంపల్లి, కూకట్‌పల్లి, ప్రగతినగర్, నిజాంపేటతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాగల మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు నిలిచిపోయాయి.
ఒడిశా తీరం.. దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం.. వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోనూ కొనసాగుతోందని వాతావరణ శాఖ (IMD) అధికారులు వెల్లడించారు. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో.. ఆవర్తనం ఆవరించి ఉందని చెప్పారు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.