Breaking : వరంగల్‌లో రెండో రోజు సీఎం కేసీఆర్ బస

-

భద్రాచలం పర్యటన అనంతరం సీఎం శ్రీ కేసీఆర్ హెలీకాప్టర్లో ఏటూరునాగారం దిశగా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుతో జలమయమై, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలిస్తూ సీఎం ఏటూరునాగారంలోని రామన్నగూడెం చేరుకున్నారు. రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి
సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఐటీడీఏ గెస్ట్ హౌజ్ కు వెళ్లిన ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం కేసీఆర్ పరిశీలించారు. వరద ప్రవాహం తగ్గాలని గోదావరికి తల్లికి సీఎం కేసీఆర్ సారె సమర్పించి, శాంతి పూజలు నిర్వహించారు.

అనంతరం అక్కడి పునరావాస కేంద్రానికి వెళ్లిన, ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి ముంపు బాధితులను పరామర్శించారు. భవనంలోని ప్రతి బాధితుడినీ కలుస్తూ అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అధికారుల నుంచి వారికి అందుతున్న సహకారం, పునరావాస ఏర్పాట్లు, భోజన వసతులపై సీఎం ఆరా తీశారు. వరద తగ్గే వరకూ పునరావాస కేంద్రాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. ముంపు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భవిష్యత్ లో వరద ముంపుతో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత నిర్మాణాలు చేపడతామని సీఎం కేసీఆర్ బాధితులకు హామీ ఇచ్చారు.

‘‘ వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా రామ‌న్న‌గూడెంలో న‌ష్టం జ‌రుగుతున్నది. ఎస్సీ, ఎస్టీ కాల‌నీల‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగింది. గ‌తంలో మాదిరి కాకుండా ఈ ప్రాంతానికి వ‌ర‌ద ముంపు రాకుండా, ఇబ్బంది లేకుండా శాశ్వతంగా తగు చ‌ర్య‌లు తీసుకుంటాం. మీరంద‌రూ మంచిగా ఉండాల‌ని కోరుకుంటున్నా.. వ‌ర‌ద‌ల్లో ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి’’ అని సీఎం అన్నారు. వ‌ర‌ద త‌గ్గుముఖం పట్టగానే అధికారులంద‌రూ వ‌చ్చి ఈ ప్రాంతాన్ని ప‌రిశీలించి, చ‌ర్య‌లు తీసుకుంటార‌ని బాధితులకు ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. వరద ప్రమాదం నుంచి ప్రజలను బయటపడేసిన ప్రజా ప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు. రామన్నగూడెం పునరావాస కేంద్రం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ముఖ్యమంత్రి తిలకించారు.

అనంతరం, ఏటూరు నాగారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నెలాఖరు వరకూ భారీ వర్షాలుంటాయన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంత పెద్ద భారీ వర్షాలు వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ప్రతి శాఖ అధికారులు మూడు షిఫ్టులుగా పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను దశలవారీగా ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని సీఎం అన్నారు. గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని, కానీ, ఇప్పుడు ఎన్ని నిధులు ఖర్చయినా సరే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరద పరిస్థితులపై భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక బుక్ ను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

వరదతో చాలా చోట్ల మిషన్ భగీరథ పైపులు దెబ్బతిన్నాయని, వాటికి తక్షణమే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు కోరినందున దీన్ని వెంటనే మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసిఆర్ కటాక్షపూర్ వద్ద రోడ్డుపై నుంచి చెరువు అలుగుపారడం చూసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉదయం సాయంత్రం అదే రూట్ లో బస్సులో వెళ్ళిన కేసిఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ రూట్ లో వెళ్ళినప్పుడు చేపలు పెట్టేవాళ్ళు జై తెలంగాణ అని నినదించేవారని సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర నేతలకు సీఎం వివరించారు. రాత్రి హన్మకొండ కు చేరుకున్న సీఎం, కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో బస చేసి రేపు ఉదయం కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసి మధ్యాహ్నం వరకు హైదరాబాద్ కు చేరుకునే అవకాశం .

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version