కోవిడ్ మహమ్మారి.. ప్రపంచవ్యాప్తంగా జనాలను అతలాకుతలం చేస్తోంది. చాలా వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో జనాలు తీవ్రమైన భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో అనేక మంది తమ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునే యత్నం చేస్తున్నారు. అయితే కింద తెలిపిన విధంగా ఆయా ఆహారాలను నిత్యం తీసుకుంటే.. దాంతో రోగ నిరోధక శక్తిని ఇంకా బాగా పెంచుకోవచ్చు. దీని వల్ల కోవిడ్ నుంచి ఇమ్యూనిటీ లభిస్తుంది. ఒక వేళ వ్యాప్తి చెందినా తక్కువ స్థాయిలో వ్యాధితో మనం బయట పడవచ్చు. త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడకుండా ఉంటాయి. ఇక రోగ నిరోధక శక్తిని పెంచే ఆ ఆహారాలు ఏమిటంటే…
* క్యారెట్లు, ఆకుకూరలు
క్యారెట్లు, ఆకుకూరల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో ఉండే విష పదార్థాలు, సూక్ష్మక్రిములు తొలగిపోతాయి. క్యారెట్లతోపాటు ఆకుకూరలు, చిలగడదుంప, బ్రొకొలి, కీరాదోస, మామిడి పండ్లు, కర్బూజా పండ్లు, యాప్రికాట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
* నారింజ, ద్రాక్ష
మన శరీరంలో రోగ నిరోధక కణాలను, తెల్ల రక్త కణాలను వృద్ధి చేసేందుకు విటమిన్ సి ఎంతగానో ఉపయోగపడుతుంది. ద్రాక్షలు, నారింజ, బత్తాయి పండ్లు, కివీలు, స్ట్రాబెర్రీలు, బెంగళూరు క్యాబేజీ, క్యాప్సికం, మిరియాలు, ఉడకబెట్టిన క్యాబేజీ, కాలిఫ్లవర్‌లలో మనకు విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దీంతో శరీర రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
* కోడిగుడ్లు, పాలు
బాక్టీరియా, వైరస్‌లు రక్తంలో ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే విటమిన్ డి తగినంతగా ఉంటే ఆ ఇన్‌ఫెక్షన్లు ఏర్పడకుండా ఉంటాయి. అందుకు గాను విటమిన్ డి ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇది మనకు సూర్య రశ్మి ద్వారా లభిస్తుంది. అలాగే చేపలు, గుడ్లు, పాలు, చీజ్, వెన్న, పనీర్, పుట్టగొడుగులలోనూ విటమిన్ డి మనకు లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం ద్వారా శరీరంలో ఇన్‌ఫెక్షన్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు. అలాగే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.
* పౌల్ట్రీ ఉత్పత్తులు, సోయా
పౌల్ట్రీ ఉత్పత్తులు, సోయాబీన్, మాంసం, శనగలు, చిక్కుడు జాతి గింజలు, చిరు ధాన్యాలు, గింజలు, చీజ్, పనీర్, పెరుగులలో జింక్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మనకు జింక్ లభిస్తుంది. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
* ఇతర సూచనలు
నిత్యం 3, 4 లీటర్ల నీటిని తాగాలి. దీంతోపాటు తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. తగినంత నిద్ర పోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే శరీర రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా రాకుండా చూసుకోవచ్చు.