ఎన్డీఏ కూటమిలో మరో పార్టీ చేరనుంది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్థానీ అవామ్ మోర్చా-సెక్యులర్(హామ్) ఈ కూటమిలో చేరనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మాంఝీ ఇవాళ(ఆగస్టు 30న) వెలువరిస్తారని పేర్కొన్నాయి. ఆగస్టు 20న మహాకూటమి నుంచి వైదొలొగింది హామ్. అనంతరం ఈ పార్టీ.. అధికార జేడీయూలో విలీనం అవుతుందని ప్రచారం జరిగింది. సీఎం నితీశ్ కుమార్ను మాంఝీ గురువారం కలవడం.. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది.మహాకూటమి, ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా జేఏపీ, వీఐపీ వంటి స్థానిక పార్టీలతో కలిసి మూడో కూటమి ఏర్పాటు చేయాలని మాంఝీ తొలుత భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కష్టతరమని భావించి తన ఆలోచన విరమించుకున్నారట.బిహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి.
ఎన్డీఏ కూటమిలో చేరితే తమ పార్టీకి 9 నుంచి 12 స్థానాలు దక్కుతాయని ‘హామ్’ నమ్మకంతో ఉంది.మరోవైపు మాంఝీ రాకతో దళిత ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా మారుతుందని బిజేపి-జేడీయూ కూటమి భావిస్తోంది. ఆ వర్గానికే చెందిన రామ్ విలాస్ పాసవాన్ కూడా ఎన్డీఏలో ఉండటం తమకు మరింత కలసివస్తుందని అనుకుంటున్నాయి.బిహార్లో మొత్తం 7 కోట్ల 21లక్షల 40వేలకు పైగా ఓటర్లున్నారు. ఇందులో 15 శాతం ఓట్లు దళితులు, మహాదళితుల వర్గానికి చెందినవే. మొత్తం ఓట్లలో.. ముస్లింలు 17 శాతం, ఓబీసీ 50 శాతం, అగ్రవర్ణాలు 19 శాతం, ఇతరులు 2 శాతం ఉన్నారు.