మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. చరణ్ కి జోడీగా ఎంపిక చేసిన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా షూట్ లో పాల్గొంటోంది. కానీ ఇప్పటివరకూ తారక్ కి హీరోయిన్ మాత్రం సెట్ కాలేదు. బ్రిటన్ బ్యూటీ డైసీ ఎడ్గార్ తప్పుకున్నప్పటి నుంచి తారక్ కి హీరోయిన్ పెద్ద సమస్య అయింది. జక్కన్న ఎంతో మందిని పరిశీలించాడు. నిత్యామీనన్. శ్రద్ధాకపూర్, జాన్వీ కపూర్ ఇలా అందరని జల్లెడ వేసాడు కానీ తన విజన్ కు తగ్గ హీరోయిన్ దొరకలేదు. డైసీ ఎగ్జిట్ నుంచి ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. దీంతో లాభం లేదనుకున్న జక్కన్న ఏకంగా హాలీవుడ్ కే వెళ్లిపోయినట్లు తాజా సన్నివేశాన్ని బట్టి తెలుస్తోంది.
తాజాగా తారక్ కు జోడీగా హాలీవుడ్ నటి ఎమ్మా రాబర్స్ట్ ను ఎంపిక చేసినట్లు యూనిట్ వర్గాల నుంచి లీకైంది. ఇటీవల జక్కన్న అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. తానా సభలు జరుగుతోన్న నేపథ్యంలో జక్కన్న అందుకే వెళ్లాడని వార్తలొచ్చాయి. కానీ దాన్ని ఆయన ఖండించాడు. వ్యక్తిగత పనిమీద వచ్చినట్లు వెల్లడించాడు. అదే సమయంలో మనలోకం డాట్ కామ్ లోతైన అద్యయనం చేసి ఆర్ ఆర్ ఆర్ పనిమీదే జక్కన్న అమెరికా వెళ్లాడని ఓ ఆర్టికల్ ప్రచురించింది. తాజాగా ఎమ్మా ఎంట్రీతో అది నిజమైంది. వాస్తవానికి తారక్ పాత్రకి విదేశీ భామ అయితేనే బాగుంటుందని జక్కన్న మొదటి నుంచి పట్టుబడి ఉన్నాడు.
ఆప్షన్ లేక దేశీయ మోడల్స్ ని చూడాల్సి వచ్చింది తప్ప ఇష్టపూర్వకంగా కాదని తాజా సందర్భాన్ని బట్టి మరోసారి రుజువైంది. అయితే ఈ విషయాన్ని జక్కన్న అధికారికాంగా ధృవీకరించాల్సి ఉంది. ఇందులో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర హీరోలకు ధీటుగా ఉంటుందని సమాచారం. షూటింగ్ పూర్తయ్యేలోపు ఆర్ ఆర్ ఆర్ లో మరింత కళ సంతరించుకోనుందిట. అవసరానికి అనుగుణంగా క్యాస్టింగ్ ఎంపిక జరుగుతోందిట. బాహుబలి తరహాలో అవసరమైన చోట తెరంతా అందాలతో నిడిపోనుందిట. మరి అవన్నీ చూడాలంటే 2020 జులై 30 వరకూ వెయిట్ చేయాల్సిందే.